Telangaana

Wednesday, January 5, 2011

విశాలాంధ్ర ఏర్పాటుకు కదిలిన పావులు

మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడానికి అప్పటిదాకా పోరాడిన వారంతా.. ఆపై తమ ఉద్యమాన్ని హైదరాబాద్ వైపు మళ్లించారు. రెండు రాష్ట్రాలను విలీనం చేసి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలంటూ ఆంధ్రప్రాంతంలో ఉద్యమం ఊపందుకొంది. కాంగ్రెస్ నేతలతో పాటు.. కమ్యూనిస్టు నేతలూ ఇందులో కీలకపాత్ర పోషించారు. కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే.. విశాలాంధ్ర ఏర్పాటుకు పావులు కదిలాయి. అప్పటికే.. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి కమ్యూనిస్టు నేతలు.. విశాలాంధ్ర కోసం డిమాండ్ చేస్తుండడంతో.. ఆంధ్రాప్రాంతంలో.. పార్టీలకతీతంగా ఈ ఉద్యమం పాకిపోయింది. భాషా ప్రాతిపదికన ఆంధ్రా, హైదరాబాద్ రాష్ట్రాలను కలిపివేసి ఒకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ఒత్తిడి పెరిగింది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా రాష్ట్ర విభజన డిమాండ్లు వస్తుండడంతో.. ఫజల్ అలీ ఛైర్మన్‌గా రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ను 1953 డిసెంబర్‌లో ఏర్పాటు చేశారు. ఆంధ్రా, హైదరాబాద్‌కు చెందిన నేతలు ఎంతోమంది.. ఈ కమిషన్‌కు రెండు రాష్ట్రాల విలీనంపై ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. విస్తృత అధ్యయనం తర్వాత.. సెప్టెంబర్ 30, 1955న ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. అయితే.. విశాలాంధ్ర ఏర్పడితే.. ప్రయోజనాలున్నప్పటికీ.. హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠా, కన్నడ మాట్లాడే ప్రాంతాలను విడదీసి.. తెలుగుమాట్లాడేవారికోసం.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఫజల్ అలీ కమిషన్ సూచించింది. ఈ రిపోర్ట్‌పై.. తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. విశాలాంధ్రకు మద్దతు ఇస్తున్న హైదరాబాద్‌లోని కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు తమ పదవులు వదలుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే.. కమిషన్ తన రిపోర్ట్‌లోనే మరో విషయాన్ని కూడా చెప్పింది. ఒకవేళ రెండు రాష్ట్రాలను విలీనం చేయాలని భావిస్తే మాత్రం.. ఇప్పటికిప్పుడే ఆ ప్రయత్నం చేయకూడదని రిపోర్ట్‌లో పేర్కొంది. ఆంధ్రా ప్రజల్లో విశాలాంధ్రకు సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం.. ఈ విషయంలో అనిశ్చితి నెలకొందని ఫజల్ అలీ గుర్తించారు. ఈ విషయాన్నే కేంద్ర ప్రభుత్వానికి ఆయన విన్నవించారు. అందుకే.. 1961లో జరిగే ఎన్నికల తర్వాత.. హైదరాబాద్ అసెంబ్లీలో విశాలాంధ్రకు అనుకూలంగా తీర్మానం ప్రవేశపెట్టాలని... మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధిస్తేనే.. రాష్ట్రాల విలీనానికి అంగీకరించాలని స్పష్టంగా చెప్పింది.. ఎస్సార్సీ.
ఎస్సార్సీ రిపోర్ట్ ప్రకారం వెళ్లాలంటే.. 1961 తర్వాత గానీ.. రాష్ట్ర విలీనం సాధ్యం కాదు. కానీ.. అరకొర వసతులతో నెట్టుకొస్తున్న ఆంధ్రరాష్ట్రానికి ఇది చాలా ఇబ్బందిగా మారింది. అప్పటికే మూడేళ్లుగా హైదరాబాద్‌ను ఎప్పుడెప్పుడు కలుపుకుందామా అన్న ఆతృతతో అక్కడి నేతలున్నారు. మరో ఐదేళ్లు ఆగితే.. ఇక రాష్ట్ర విలీనం కాదన్న అంచనాతో.. ఆంధ్రా కాంగ్రెస్ నేతలు విశాలాంధ్రకోసం ఉద్యమాన్ని తీవ్రం చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండడంతో.. వెంటనే విలీనం జరగాలంటూ.. పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. విశాలాంధ్ర ఏర్పాటుకు కాంగ్రెస్ హై కమాండ్ కూడా.. సముఖంగా ఉండడంతో.. రెండు ప్రాంతాల మధ్య విభేధాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. దీంతో ఎస్సార్సీ రిపోర్ట్‌కు భిన్నంగా.. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి మార్గం సుగమమయ్యింది.

No comments:

Post a Comment