Telangaana

Friday, December 31, 2010

ఆంధ్ర, తెలంగాణ ప్రేమ కథకు తొలిమెట్టు

అందరూ భావిస్తున్నట్లు.. పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాలేదు. ఎన్నో ఒప్పందాల పునాదులపై రాష్ట్ర విలీనం జరిగింది. అభివృద్ధి చెందిన ఆంధ్రా ప్రాంతం ఓ వైపు... అట్టడుగున ఉన్న తెలంగాణ మరో వైపు.. ఈ రెండింటినీ కలపడం కోసం ఎన్నో హామీలను ఇచ్చారు ఆంధ్రా నేతలు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి.. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించే వరకూ ఎన్నో కీలక పరిణామాలు... సంఘటనలు చోటు చేసుకున్నాయి

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉంటే.. తెలుగు జాతి అభివృద్ధి కష్టమని భావించడంతో.. ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం మొదలయ్యింది. దీనికి ప్రేరణ.. బెంగాల్ రాష్ట్ర విభజన. 1911లో భారత గవర్నర్ జనరల్‌ కలకత్తా ప్రెసిడెన్సీలోని హిందీ మాట్లాడే వారిని విభజించి.. బీహార్ రాష్ట్రంగా ఏర్పాటు చేశాడు. అప్పటికే స్వతంత్ర్య పోరాటంలో ఉధృతంగా పాల్గొంటున్న ఆంధ్రులను కదిలించింది. మద్రాసు రాష్ట్రంలోని తెలుగువారికోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలన్న డిమాండ్ అప్పటి నుంచే ఊపందుకొంది. 1938 నాటికి ఈ డిమాండ్ మరింత తీవ్రమయ్యింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ నేరుగా లండన్ వెళ్లి.. బ్రిటీష్ ప్రభుత్వ కార్యదర్శితో చర్చలు కూడా జరిపారు. మరో ఏడాదిలో ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు అక్కడ గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే.. అప్పుడే రెండోప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో.. పెండింగ్‌లో పడింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. మద్రాసు స్టేట్‌ను విభజించడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. అయితే.. మద్రాసు రాజధానిగా కావాలని పట్టుబడ్డటం.. దీనికి తమిళనేతలు మోకాళ్లడ్డడంతో.. ఈ ప్రక్రియ ఆగిపోయింది. చివరకు.. మద్రాసు రాజధానిగా ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. పొట్టి శ్రీరాములు ఆమరణదీక్ష పూనడంతో.. పరిస్థితిలో మార్పు వచ్చింది. 58 రోజుల దీక్ష తర్వాత.. ఆయన ప్రాణం వదలడంతో.. (ఇదే సమయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటు స్వామి సీతారాం 35రోజుపాటు నిరాహార దీక్ష చేశారు. అయితే వినోభభావే జోక్యం చేసుకోవడంతో ఆయన దీక్ష విరమించారు.) ఆంధ్రదేశంలో కల్లోలం పుట్టింది. ఎక్కడికక్కడ ఆందోళనలు చేసి.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని భారత ప్రధాని నెహ్రూ డిసెంబర్ 19, 1952న స్వయంగా ప్రకటన చేశారు. కానీ.. రాష్ట్ర విభజన పూర్తి కావడానికి దాదాపు పదినెలల సమయం పట్టింది. అక్టోబర్ 1, 1953న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు బాధ్యతలు స్వీకరించారు. అయితే.. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలవడంతోనే రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల మధ్య విబేధాలు వచ్చాయి. 1937లో కాశీనాధుని నాగేశ్వరావు నివాసం.. శ్రీభాగ్‌లో ఇరు ప్రాంత నేతలూ చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని సీమ నేతలు డిమాండ్ చేశారు. ఆ ఒప్పందం ప్రకారం.. ఆంధ్రా యూనివర్సిటీకి వాల్తేరుతో పాటు అనంతపురంలోనూ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కోస్తా జిల్లాలతో సమానంగా సీమ జిల్లాలు అభివృద్ధి చెందడానికి పదేళ్లపాటు.. నీటిపారుదల రంగంలో ప్రాధాన్యం ఇవ్వాలి. రాజధాని ఓ ప్రాంతంలో ఏర్పాటైతే.. హైకోర్టు మరోప్రాంతంలో ఏర్పాటు కావాలి.. ఇలా చాలా విషయాలపై అవగాహన కుదుర్చుకున్నారు. దీనికి అనుగుణంగా.. రాజధాని కర్నూలులో ఏర్పాటు చేశారు. హైకోర్టును గుంటూరులో పెట్టారు. ఇక హైదరాబాద్‌రాష్ట్రాన్ని కూడా... ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేసుకోవాలన్న ఉద్దేశం అప్పటికే చాలామంది నేతల్లో ఉంది. విశాలాంధ్ర ఏర్పడితే.. అప్పటికే అన్ని వసతులున్నహైదరాబాద్‌ను రాజధానిగా చేసుకుందామని.. ఆంధ్ర,సీమ ప్రాంత నేతలంతా అప్పటికే ఓ అవగాహనకు వచ్చారు.